About Ram Thangam – Telugu

A

ప్రముఖ తమిళ యువ రచయిత, రామ్ తంగం కన్యాకుమారి జిల్లా, నాగర్‌కోయిల్‌కు చెందినవారు. వీరు 28.2.1988న జన్మించారు. సమతనపురం (Samathanapuram) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మరియు అగస్తీశ్వరం (Agastheeswaram) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించారు. తమిళనాడు ఓపెన్ యూనివర్శిటీ నుండి హిస్టరీలో బి.ఎ మరియు మీడియా ఆర్ట్‌లో డిప్లొమా చేశారు. చదువుపై మక్కువతో చిన్నప్పటి నుంచి రాయడం ప్రారంభించారు. దినకరన్, ఆనంద వికటన్‌ పత్రికలకు రచయితగా పని చేశారు. ప్రస్తుతం పూర్తిస్థాయి రచయితగా, సినిమాలకు పని చేస్తున్నారు.

రామ్ తంగం గారి మొదటి పుస్తకం ‘గాంధీ రామన్’ మార్చి 2015లో విడుదలైంది. ఈ పుస్తకాన్ని సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతైన త్రియు. పొన్నీలన్ గారు నాగర్‌కోయిల్‌లో ఆవిష్కరించారు. ‘గాంధీ రామన్’ పుస్తకం ‘తిరు’ జీవిత చరిత్రను అందిస్తుంది. గాంధీ రామన్ స్వాతంత్ర్య సమరయోధుడు. వైకం, సుసీంద్రం ఆలయ ప్రవేశ నిరసనలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఈ పుస్తకం సదరన్ రైటర్స్ మూవ్‌మెంట్ అవార్డును కైవసం చేసుకుంది.
కన్యాకుమారి జిల్లా చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, అమరవీరులు మరియు రచయితల గురించి ప్రయాణ ఆధారిత “ఊర్ సూత్రి పరవై” అనే కథా పుస్తకాన్ని 2015 సంవత్సరంలో రామ్ తంగం గారు రచించారు. ఈ పుస్తకాన్ని J.E. పబ్లికేషన్స్ ద్వారా నాగర్‌కోయిల్‌లో కలచువాడు ప్రచురణకర్త ‘తిరు కణ్ణన్’ గారు ముద్రించారు.

ప్రస్తుతం, ‘ఊర్ సూత్రి పరవై’ కొత్త ఆకాశంలో ప్రయాణిస్తోంది మరియు వనవిల్ పుస్తకాలయం పబ్లికేషన్స్‌ వారు మళ్లీ ముద్రించారు. జానపద పరిశోధకుడు ‘ఎ.కె. పెరుమాళ్’ గారి పరిచయం ద్వారా రామ్ తంగం గారు చరిత్రపై ఆసక్తిని పెంచుకున్నారు. రామ్ తంగం గారి తదుపరి పుస్తకం ‘మీనవ వీరంకు ఒరు కోవిల్’ ‘ఎ.కె. పెరుమాళ్’ గారు చెప్పిన జానపద కథ నుండి ఉద్భవించింది. దక్షిణాది దేశపు సంప్రదాయాలు, ఆచార సంప్రదాయాలు, నమ్మకాలపై రచించిన ఈ జానపద పుస్తకాన్ని J.E. పబ్లికేషన్స్ ముద్రించింది. ఈ పుస్తకాన్ని జనవరి 2016లో సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న రచయిత ‘జో డి క్రూజ్’ గారు నాగర్‌కోయిల్‌లో ఆవిష్కరించారు. రామ్ తంగం గారి మొదటి మూడు పుస్తకాలకు చరిత్రకారులు ‘ఎ.కె. పెరుమాళ్’ గారు ముందుమాట రాశారు. రామ్ తంగం గారు 2016-17 మధ్యకాలంలో తన స్నేహితులతో కలిసి ‘త్రివేణి సాహిత్య సంగమం’ నడిపారు.

రామ్ తంగం గారు ‘త్రివేణి సాహిత్య సంగమం’ ద్వారా పుస్తక పరిచయాలు, చర్చలు వంటి వివిధ సాహిత్య కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. ‘త్రివేణి సాహిత్య సంఘం’, ‘మక్కల్ వాసిప్పు ఇయక్కం’ సంస్థల సహకారంతో నాగర్‌కోయిల్‌లో మూడుసార్లు పుస్తక ప్రదర్శనలు నిర్వహించారు. సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న రచయిత ‘నాంజిల్ నాదన్’ మరియు అనువాదకురాలు శ్రీమతి ‘కె.వి. జయశ్రీ’ గార్ల నుండి ప్రోత్సాహం, ప్రేరణ పొంది రామ్ తంగం గారు కథలు రాయడం ప్రారంభించారు.

నవంబర్ 30, 2017లో ‘ఆనంద వికటన్’ పత్రికలో మొదటి చిన్న కథ ‘తిరుకార్తియాల్’ ప్రచురితమైంది. ఇది తమిళ సాహిత్య ప్రపంచంలో విస్తృతంగా మరియు విస్మయపరిచే దృష్టిని అందుకుంది. ఈ చిన్న కథకు ‘జ్ఞాని కోలం ఫౌండేషన్’ నుండి ‘అశోకమిత్రన్’ అవార్డు లభించింది. 2018 డిసెంబర్‌లో వంశీ బుక్స్‌చే ‘తిరుకార్తియాల్‌’ చిన్న కథల సంపుటి ముద్రించబడింది. ఈ పుస్తకాన్ని జర్నలిస్టు ‘పి. తిరుమావేలన్’ గారు చెన్నైలో ఆవిష్కరించారు.

‘తిరుకార్తియాల్’ తమిళ సాహిత్యంలో రామ్ తంగంకు ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది. ఈ పుస్తకానికి 2019 సంవత్సరానికి గాను ‘సుజాత అవార్డ్, నార్త్ చెన్నై తమిళ లిటరరీ అవార్డు, సౌమ లిటరరీ అవార్డు, పడైపు లిటరరీ అవార్డు, అంట్రిల్ లిటరరీ అవార్డు’ వంటి వివిధ అవార్డులను లభించాయి. రామ్ తంగం గారు ‘పొన్నీలన్-80’ని, 2019 నవంబరు 15-16 తేదీల్లో నాగర్‌కోయిల్‌లో ప్రముఖ సాహిత్యవేత్తలు, పాఠకుల నడుమ నిర్వహించారు. ‘పొన్నీలన్-80’ పుస్తకానికి సంపాదకత్వం వహించి, అదే రోజున పుస్తకాన్ని ఆవిష్కరించారు.

2020 సంవత్సరంలో సింగపూర్‌లో ‘మాయా లిటరరీ సర్కిల్’ నిర్వహించిన లఘు నవలల పోటీలో రామ్ తంగం గారు రచించిన ‘రాజవనం’ అనే లఘు నవల మొదటి బహుమతికి ఎంపిక అయ్యింది. ఈ పుస్తకాన్ని వంశీ పబ్లికేషన్స్ ప్రచురించింది. ఈ పుస్తకం ‘విజయ రీడర్స్ సర్కిల్’ అందించే ‘పాడైపు సాహిత్య అవార్డు’ మరియు ‘కవి మీరా’ అవార్డును గెలుచుకుంది.

“నాలోని తపన, ఉత్సుకత నన్ను చదివేలా చేస్తాయి. అది నన్ను రాయడానికి పురి కొల్పుతుంది. నేను ప్రయాణించడానికి మరియు షికారు చేసేలా ప్రేరణను ఇస్తుంది. నా రచనల్లో ఈ మూడూ ఒకదానితో ఒకటి మిళితం అవుతాయి.”
-రామ్ తంగం

రామ్ తంగం గారి రెండవ చిన్న కథల సంపుటి, ‘పులిక్కుతి’ డిసెంబర్ 2021లో వంశీ బుక్స్ ద్వారా ప్రచురించబడింది. ఇది ఉత్తమ కథా సంకలనంగా 2021గాను ‘సౌమ లిటరరీ అవార్డు’ మరియు పాడైపు సాహిత్య అవార్డును’ గెలుచుకుంది. “పుస్తకం పాఠకుల మనసులో ఎన్నో మార్పులను కలిగిస్తుంది. ప్రయాణం కొత్త వ్యక్తుల గురించి, వారి సంస్కృతి, జీవనశైలి మరియు వారి జీవన విధానాల గురించి అవగాహన కలిగిస్తుంది”. రామ్ తంగం గారికి ప్రయాణాలంటే చాలా ఆసక్తి, తన ప్రయాణ అనుభవాలను ‘దేవుని భూమి’గా ‘వనవిల్ పుస్తకాలయం’ ద్వారా ముద్రించారు. ఇది పాడైపు లిటరేచర్ గ్రూప్ యొక్క 2023 బెస్ట్ బుక్ ఆన్ ఎస్సే అవార్డును గెలుచుకుంది. నేషనల్ బుక్ ట్రస్ట్ కోసం ఇంగ్లీషు నుంచి తమిళంలోకి ‘సూరియానై ఏట యెజ్వు పడికల్’, ‘కత్తిలే ఆనందం’, ‘ఒరు సుండేలెయిన్ కతి’ అనే పిల్లల కథలను అనువదించారు. కుమారి జిల్లాపై వీరు రాసిన చారిత్రక వ్యాసాలు అమెజాన్ కిండిల్ లో ‘చిత్రాలు’ శీర్షికతో ఈ-బుక్ గా ముద్రించబడింది.

చాలా మంది కళాశాల విద్యార్థులు రామ్ తంగం పుస్తకాలపై డాక్టరేట్ పరిశోధన చేశారు. కన్యాకుమారి జిల్లా ప్రజల జీవితం, చరిత్ర, పురాణాల గురించి రచించే రామ్ తంగం గారు మాట్లాడుతూ ‘నా భూమే.. నా కథా, కథాంశం అన్నారు. రామ్ తంగం గారి చిన్న కథల సంపుటి ‘తిరుకార్తియాల్’కి 2023 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్నారు. తిరుకార్తియాల్‌లోని ‘వెలిచం’ అనే చిన్న కథ నాగర్‌కోయిల్‌లోని ‘హోలీ క్రాస్ కళాశాల’ పాఠ్యాంశాల్లో చేర్చబడింది. రచయిత్రి భారతి బాలన్ గారి సంపాదకత్వంలో సాహిత్య అకాడమీ ముద్రించిన 2000-2020 తమిళ చిన్న కథల సంకలనానికి ‘తిరుకార్తియాల్’ సంకలనంలోని ‘కడంతు పోగుమ్’ అనే చిన్న కథ ఎంపికైంది. ఈ కథను అనువాదకులు ‘రఘురామ్ మంజేరి’ గారు ‘కడంతు పోగొమ్’ పేరుతో మలయాళంలోకి అనువదించారు. జూన్ 2023లో ‘దేశాబిమాని’ వారపత్రికలో ముద్రించబడింది.

ఆత్మ ఆన్‌లైన్ మలయాళ వెబ్‌సైట్ యొక్క ఆర్టెరియా వీక్లీ ఇ-మ్యాగజైన్‌లో 25 ఆగస్టు 2023న తిరుకార్తియాల్‌పై ఇంటర్వ్యూ ప్రచురించబడింది. అలాగే, సెప్టెంబర్ 11, 2023న ప్రచురించబడిన మలయాళ వారపత్రిక ‘మధ్యమం’ కవర్‌స్టోరీగా రామ్ తంగం గారి ఇంటర్వ్యూ ప్రచురించబడింది. ఇదే పత్రికలో ‘తిరుకార్తియాల్’ అనే చిన్న కథను ‘షఫీ చెరుమావిలై’ గారు అనువదించి ‘తిరుకార్తికా’ పేరుతో ప్రచురించారు. డిసెంబర్ 2023లో, రామ్ తంగం రచించిన ‘వారణం’ నవల వంశీ బుక్స్ ద్వారా ముద్రించబడింది.